దాశరథి శతకము dasarathi satakam

దాశరథి శతకము

దాశరథి శతకము dasarathi satakam, దాశరథి శతకం పద్యాలు భావాలు, Dasarathi satakam Telugu pdf, కంచెర్ల గోపన్న poems, దాశరథి కృష్ణమాచార్య పద్యాలు, దాశరథీ కరుణాపయోనిధీ


ఉ. శ్రీరఘురామ చారుతులసీదళదామ శమక్షమాది శృం

గారగుణాభిరామ త్రిజగన్నుతశౌర్యరమాలలామ దు

ర్వార కబంధరాక్షసవిరామ జగజ్జనకల్మషార్ణవో

త్తారకనామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! (1)


ఉ. రామ విశాలవిక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ

స్తోమ పరాంగనావిముఖ సువ్రతకామ వినీల నీరద

శ్యామ కకుత్స్థవంశకలశాంబుధి సోమ సురారిదోర్బలో

ద్దామవిరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! 2


చ. అగణితసత్యభాష శరణాగతపోష దయాలసజ్ఝరీ

విగతసమస్తదోష పృథివీసురతోష త్రిలోకపూతకృ

ద్గగనధునీమరంద పదకంజవిశేష మణిప్రభా ధగ

ద్ధగితవిభూష భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! 3


ఉ. రంగదరాతిభంగ ఖగరాజతురంగ విపత్పరంపరో

త్తుంగ తమఃపతంగ పరితోషితరంగ దయాంతరంగ స

త్సంగ ధరాత్మజాహృదయసారసభృంగ నిశాచరాబ్జమా

తంగ శుభాంగ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! 4


ఉ. శ్రీద సనందనాది మునిసేవితపాద దిగంతకీర్తిసం

పాద సమస్తభూతపరిపాలవినోద విషాదవల్లికా

చ్ఛేద ధరాధినాథకుల సింధుసుధామయపాద నృత్తగీ

తాది వినోద భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! 5


ఉ. ఆర్యులకెల్ల మ్రొక్కి వినతాంగుఁడనై రఘునాథభట్టరా

చార్యుల కంజలెత్తి కవిసత్తములన్‌ వినుతించి కార్యసౌ

కర్యమెలర్పనొక్క శతకంబొనఁగూర్చి రచింతునేఁడు తా

త్పర్యమునన్‌ గ్రహింపుమిది దాశరథీ! కరుణాపయోనిధీ! 6


చ. మసకొని రేఁగుబండ్లకును మౌక్తికముల్‌ వెలబోసినట్లు దు

ర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితి మోసమయ్యె నా

రసనకుఁ బూతవృత్తిసుకరంబుగఁ జేకురునట్లు వాక్సుధా

రసములు చిల్కఁ బద్యముఖరంగమునందు నటింపవయ్య సం

తసమును జెంది భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! 7


ఉ. శ్రీరమణీయహార యతసీకుసుమాభశరీర భక్తమం

దార వికారదూర పరతత్త్వవిహార త్రిలోకచేతనో

ద్ధార దురంతపాతకవితానవిదూర ఖరాదిదైత్యకాం

తార కుఠార భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! 8


చ. దురితలతాలవిత్ర ఖరదూషణకాననవీతిహోత్ర భూ

భరణకళావిచిత్ర భవబంధవిమోచనసూత్ర చారువి

స్ఫురదరవిందనేత్ర ఘనపుణ్యచరిత్ర వినీలభూరికం

ధరసమగాత్ర భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! 9


చ. కనకవిశాలచేల భవకాననశాతకుఠారధార స

జ్జనపరిపాలశీల దివిజస్తుతసద్గుణకాండ కాండసం

జనిత పరాక్రమ క్రమవిశారద శారద కందకుంద చం

దనఘనసార సారయశ దాశరథీ! కరుణాపయోనిధీ! 10


ఉ. శ్రీరఘువంశ తోయధికి శీతమయూఖుఁడవైన నీ పవి

త్రోరుపదాబ్జముల్‌ వికసితోత్పల చంపకవృత్తమాధురీ

పూరితవాక్ప్రసూనములఁ బూజలొనర్చెద జిత్తగింపుమీ

తారకనామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! 11


చ. గురుతరమైన కావ్యరస గుంభనకబ్బురమంది ముష్కరుల్‌

సరసులమాడ్కి సంతసిల జాలుదురోటు శశాంకచంద్రికాం

కురముల కిందుకాంతమణికోటి స్రవించినభంగి వింధ్యభూ

ధరమున జాఱునే శిలలు దాశరథీ! కరుణాపయోనిధీ! 12


చ. తరణికులేశ నానుడులఁ దప్పులు గల్గిన నీదునామ స

ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియన్నదీజలం

బరుగుచువంకయైన మలినాకృతిఁబాఱినఁ దన్మహత్త్వముం

దరమె గణింపనెవ్వరికి దాశరథీ! కరుణాపయోనిధీ! 13


ఉ. దారుణపాతకాబ్ధికి సదాబడబాగ్ని భవాకులార్తి వి

స్తార దవానలార్చికి సుధారసవృష్టి దురంతదుర్మతా

చార భయంకరాటవికిఁ జండకఠోరకుఠారధార నీ

తారకనామ మెన్నుకొన దాశరథీ! కరుణాపయోనిధీ! 14


చ. హరునకు నవ్విభీషణున కద్రిజకుం దిరుమంత్రరాజమై

కరికి నహల్యకున్‌ ద్రుపదకన్యకు నార్తిహరించు చుట్టమై

పరగినయట్టి నీ పతితపావననామము జిహ్వపై నిరం

తరము నటింపజేయుమిఁక దాశరథీ! కరుణాపయోనిధీ! 15


ఉ. ముప్పునఁ గాలకింకరులు ముంగిటవచ్చినవేళ రోగముల్‌

గొప్పరమైనచోఁ గఫము కుత్తుక నిండినవేళ బాంధవుల్‌

గప్పిన వేళ మీ స్మరణ గల్గునొ గల్గదొ నాఁటి కిప్పుడే

తప్పక చేతు మీభజన దాశరథీ! కరుణాపయోనిధీ! 16


చ. "పరమదయానిధే పతిత పావననామ హరే"యటంచు సు

స్థిరమతులై సదా భజన సేయు మహాత్ముల పాదధూళి నా

శిరమున దాల్తు మీరటకు జేరకుఁడంచు యముండు కింకరో

త్కరముల కాన బెట్టునఁట దాశరథీ! కరుణాపయోనిధీ! 17


చ. అజునకుదండ్రివయ్యు సనకాదులకుం బరతత్త్వమయ్యు స

ద్ద్విజమునికోటికెల్లఁ గులదేవతవయ్యు దినేశవంశ భూ

భుజులకు మేటివయ్యు బరిపూర్ణుఁడవై వెలుగొందు పక్షిరా

డ్ధ్వజ మిముఁ బ్రస్తుతించెదను దాశరథీ! కరుణాపయోనిధీ! 18


ఉ. "పండిత రక్షకుం డఖిల పాపవిమోచనుఁ డబ్జసంభవా

ఖండలపూజితుండు దశ కంఠవిలుంఠన చండకాండ కో

దండకళాప్రవీణుఁ"డను తావక కీర్తివధూటికిత్తు బూ

దండలుగాఁగ నా కవిత దాశరథీ! కరుణాపయోనిధీ! 19


ఉ. శ్రీరమ సీతగాఁగ నిజసేవకబృందము వీరవైష్ణవా

చారజనంబుగాఁగ విరజానది గౌతమిగా వికుంఠము

న్నారయ భద్రశైలశిఖరాగ్రముగాఁగ వసించు చేతనో

ద్ధారకుఁడైన విష్ణుఁడవు దాశరథీ! కరుణాపయోనిధీ! 20


ఉ. కంటి నదీతటంబుఁ బొడఁగంటిని భద్రనగాదివాసముం

గంటి నిలాతనూజ నురు కార్ముకమార్గణ శంఖచక్రముల్‌

గంటిని మిమ్ము లక్ష్మణునిఁ గంటి కృతార్థుడనైతి నో జగ

త్కంటక దైత్యనిర్దళన దాశరథీ! కరుణాపయోనిధీ! 21


చ. హలికునకున్‌ హలాగ్రమున నర్థము చేకురుభంగి దప్పిచే

నలమటఁజెందువానికి సురాపగలో జలమబ్బినట్లు దు

ర్మలిన మనోవికారినగు మర్త్యుని నన్నొడఁగూర్చి నీపయిం

దలపు ఘటింపఁజేసితివి దాశరథీ! కరుణాపయోనిధీ! 22


ఉ. కొంజక తర్కవాదమను గుద్దలిచేఁ బరతత్త్వభూస్థలిన్‌

రంజిలఁద్రవ్వి కన్గొనని రామనిధానము నేఁడు భక్తి సి

ద్ధాంజనమందు హస్తగత మయ్యె భళీయనగా మదీయహృ

త్కంజమునన్‌ వసింపుమిఁక దాశరథీ! కరుణాపయోనిధీ! 23


ఉ. రాముఁడు ఘోరపాతకవిరాముఁడు సద్గుణకల్పవల్లికా

రాముఁడు షడ్వికారజయరాముఁడు సాధుజనావనవ్రతో

ద్దాముఁడు రాముఁడే పరమదైవము మాకని మీయడుంగుఁ గెం

దామరలే భజించెదరు దాశరథీ! కరుణాపయోనిధీ! 24


ఉ. చక్కరమాని వేము దినఁజాలిన కైవడి మానవాధముల్‌

పెక్కురు బక్కదైవముల వేమఱుగొల్చెద రట్లకాదయా

మ్రొక్కిన నీక మ్రొక్కవలె మోక్షమొసంగిన నీవ యీవలెన్‌

దక్కినమాట లేమిటికి దాశరథీ! కరుణాపయోనిధీ! 25


ఉ. రాకలుషంబులెల్ల బయలం బడద్రోచిన మా కవాటమై

దీకొనిఁ బ్రోచు నిక్కమని ధీయుతులెన్నఁ దదీయవర్ణముల్‌

గైకొని భక్తిచే నుడువఁ గానరు గాక విపత్పరంపరల్‌

దాకొనుచే జగజ్జనుల దాశరథీ! కరుణాపయోనిధీ! 26


ఉ. "రామహరే కకుత్స్థకుల రామహరే రఘురామరామ శ్రీ

రామహరే" యటంచు మది రంజిల భేకగళంబులీల నీ

నామము సంస్మరించిన జనంబు భవంబెడబాసి తత్పరం

ధామనివాసులౌదుఁరట దాశరథీ! కరుణాపయోనిధీ! 27


ఉ. చక్కెర లప్పకున్‌ మిగుల జవ్వని కెంజిగురాకు మోవికిం

జొక్కపుజుంటి తేనియకుఁ జొక్కులుచుం గనలేరుగాక నేఁ

డక్కట రామనామ మధురామృతమానుటకంటె సౌఖ్యమా

తక్కినమాధురీ మహిమ దాశరథీ! కరుణాపయోనిధీ! 28


ఉ. అండజవాహ నిన్ను హృదయంబున నమ్మినవారి పాపముల్‌

కొండలవంటివైన వెసఁ గూలి నశింపకయున్నె సంతతా

ఖండలవైభవోన్నతులు గల్గకమానునె మోక్షలక్ష్మికై

దండయొసంగకున్నె తుద దాశరథీ! కరుణాపయోనిధీ! 29


ఉ. చిక్కని పాలపై మిసిమిఁ జెందిన మీఁగడ పంచదారతో

మెక్కినభంగి మీ విమల మేచకరూప సుధారసంబు నా

మక్కువపళ్ళెరంబున సమాహిత దాస్యమనేటి దోయిటన్‌

దక్కెనటంచు జుఱ్ఱెదను దాశరథీ! కరుణాపయోనిధీ! 30


చ. సిరులిడ సీత పీడలెగజిమ్ముటకున్‌ హనుమంతుఁ డార్తి సో
దరుఁడు సుమిత్రసూతి దురితంబులు మానుప రామనామమున్‌
గరుణఁ దరిల్ప మానవులఁ గావఁగఁ బన్నిన వజ్రపంజరో
త్కరముగదా భవన్మహిమ దాశరథీ! కరుణాపయోనిధీ! 31

చ. హలి కులిశాంకుశ ధ్వజ శరాసన శంఖ రథాంగ కల్పకో
జ్జ్వల జలజాత రేఖలను సాంకములై కనుపట్టుచున్న మీ
కలితపదాంబుజ ద్వయము గౌతమపత్ని కొసంగినట్లు నా
తలవునఁజేర్చి కావగఁదె దాశరథీ! కరుణాపయోనిధీ! 32

చ. జలనిధిలోనదూఱి కులశైలముమీటి ధరిత్రిగొమ్మునం
దలవడమాటి రక్కసుని యంగము గీటి బలీంద్రునిన్‌ రసా
తలమునమాటి పార్థివకదంబముగూర్చిన మేటి రామనా
తలఁపుననాటి రాఁగదవె దాశరథీ! కరుణాపయోనిధీ! 33

ఉ. భండనభీముఁ డార్తజనబాంధవుఁ డుజ్జ్వలబాణతూణ కో
దండకలాప్రచండ భుజతాండవకీర్తికి రామమూర్తికిన్‌
రెండవసాటిదైవమిఁక లేఁడనుచున్‌ గడగట్టి భేరికా
డాండ డడాండడాండ నినదంబు లజాండము నిండ మత్తవే
దండము నెక్కిచాటెదను దాశరథీ! కరుణాపయోనిధీ! 34

ఉ. అవనిజ కన్నుదోయితొగలందు వెలింగెడు సోమ జానకీ
కువలయనేత్ర గబ్బిచనుఁగొండలనుండు ఘనంబ మైథిలీ
నవనవయౌవనంబను వనంబునకున్‌ మదదంతి వీవెకా
దవిలి భజింతు నెల్లపుడు దాశరథీ! కరుణాపయోనిధీ! 35

చ. ఖరకరవంశజా విను మఖండిత భూతపిశాచ ఢాకినీ
జ్వరపరితాప సర్వభయవారకమైన భవత్పదాబ్జవి
స్ఫురదురువజ్రపంజరముఁ జొచ్చితి నీయెడ దీనమానవో
ద్ధరబిరుదాంక యేమఱకు దాశరథీ! కరుణాపయోనిధీ! 36

ఉ. జుఱ్ఱెద మీకథామృతము జుఱ్ఱెద మీపదకంజతోయమున్‌
జుఱ్ఱెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు నే
జుఱ్ఱెద జుఱ్ఱజుఱ్ఱఁగ రుచుల్‌ గనువారిపదంబుఁ గూర్పవే
తఱ్ఱులతోడి పొత్తిడక దాశరథీ! కరుణాపయోనిధీ! 37

ఉ. ఘోరకృతాంతవీరభటకోటికి గుండెదిగుల్‌ దరిద్రతా
కారపిశాచసంహరణకార్యవినోది వికుంఠమందిర
ద్వార కవాటభేది నిజదాసజనావళికెల్ల ప్రొద్దు నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ! కరుణాపయోనిధీ! 38

ఉ. విన్నపమాలకించు రఘువీర! నహిప్రతిలోకమందు నా
కన్నదురాత్ముఁడు బరమకారుణికోత్తమ! వేల్పులందు నీ
కన్న మహాత్ముఁడుం బతిత కల్మషదూరుఁడు లేఁడునాకు వి
ద్వన్నుత నీవె నాకు గతి దాశరథీ! కరుణాపయోనిధీ! 39

ఉ. పెంపనుఁ దల్లివై కలుషబృందసమాగమ మొందకుండ ర
క్షింపను దండ్రివై మెయువసించు దశేంద్రియరోగముల్‌ నివా
రింపను వెజ్జువై కృప గుఱించి పరంబు దిరంబుగాఁగ స
త్సంపదలీయ నీవెగతి దాశరథీ! కరుణాపయోనిధీ! 40

ఉ. కుక్షినజాండ పంక్తులొనఁగూర్చి చరాచరజంతుకోటి సం
రక్షణసేయు తండ్రివి పరంపర నీ తనయుండనైన నా
పక్షము నీవు గావలదె పాపము లెన్ని యొనర్చినన్‌ జగ
ద్రక్షక కర్త వీవె కద దాశరథీ! కరుణాపయోనిధీ! 41

ఉ. గద్దరి యోగిహృత్కమల గంధరసానుభవంబుఁజెందు పె
న్నిద్దపు గండుఁదేఁటి ధరణీసుత కౌఁగిలిపంజరంబునన్‌
ముద్దులు గుల్కు రాచిలక ముక్తినిధానమ రామ రాఁగదే
తద్దయు నేఁడు నాకడకు దాశరథీ! కరుణాపయోనిధీ! 42

చ. కలియుగ మర్త్యకోటి నినుఁ గన్గొనరాని విధంబొ భక్తవ
త్సలతవహింపవో చటుల సాంద్రవిపద్దశ వార్ధిఁగ్రుంకుచో
బిలిచినఁ బల్కవింతమఱపే నరులిట్లనరాదుగాక నీ
తలఁపునలేదే సీత చెఱ దాశరథీ! కరుణాపయోనిధీ! 43

చ. జనవర! మీ కథాళి విన సైఁపక కర్ణములందు ఘంటికా
నినద వినోదముల్‌ సలుపు నీచునకున్‌ వరమిచ్చినావు ని
న్ననయమునమ్మి కొల్చిన మహాత్ములకేమి యొసంగెదో సనం
దననుత! మాకొసంగుమయ దాశరథీ! కరుణాపయోనిధీ! 44

ఉ. పాపము లొందువేళ రణపన్నగభూత భయజ్వరాదులం
దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిం
బ్రాపుగ నీవుఁ దమ్ముఁడిరు ప్రక్కియలంజని తద్విపత్తిసం
తాపముమాన్పి కాతువఁట దాశరథీ! కరుణాపయోనిధీ! 45

చ. అగణితజన్మకర్మదురితాంబుధిలోఁ బహుదుఃఖవీచికల్‌
దెగిపడ నీఁదలేక జగతీధవ నీ పదభక్తినావచేఁ
దగిలి తరింపగోరితిఁ బదంపడి నాదు భయంబుమాన్పవే
తగదని చిత్తమందిడక దాశరథీ! కరుణాపయోనిధీ! 46

ఉ. నేనొనరించు పాపము లనేకములైనను నాదుజిహ్వకుం
బానకమయ్యె మీపరమ పావననామము దొంటి చిల్క "రా
మా! ననుఁగావు"మన్న తుది మాటకు సద్గతిఁజెందెఁ గావునన్‌
దాని ధరింపఁగోరెదను దాశరథీ! కరుణాపయోనిధీ! 47

చ. పరధనముల్‌ హరించి పరభామలనంటి పరాన్నమబ్బినన్‌
మురిపముకాని మీఁదనగు మోసమెఱుంగదు మానసంబు దు
స్తరమిది కాలకింకర గదాహతి పాల్పడనీక మమ్మునే
తఱిదరిఁజేర్చి కాచెదవొ దాశరథీ! కరుణాపయోనిధీ! 48

ఉ. చేసితి ఘోరకృత్యములు చేసితి భాగవతాపచారముల్‌
చేసితి నన్యదైవములఁ జేరి భజించిన వారిపొందు నేఁ
చేసితినేరముల్‌ దలఁచి చిక్కులఁబెట్టకుమయ్య యయ్య నీ
దాసుఁడనయ్య భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! 49

చ. పరుల ధనంబుఁజూచి పర భామల జూచి హరింపగోరు మ
ద్గురుతరమానసంబనెడు దొంగనుబట్టి నిరూఢదాస్య వి
స్ఫురితవివేక పాశములఁ జుట్టి భవచ్చరణంబనే మరు
త్తరువునఁ గట్టివేయఁగదె దాశరథీ! కరుణాపయోనిధీ! 50

చ. సలలిత రామనామ జప సారమెఱుంగను గాశికాపురీ
నిలయుఁడఁగాను మీచరణ నీరజరేణు మహాప్రభావముం
దెలియ నహల్యఁగాను జగతీవర! నీదగు సత్యవాక్యముం
దలఁపఁగ రావణాసురుని తమ్ముఁడగాను భవద్విలాసముల్‌
తలఁచి నుతింప నాతరమె దాశరథీ! కరుణాపయోనిధీ! 51

ఉ. పాతకులైన మీ కృపకుఁ బాత్రులు కారె తలంచి చూడ జ
ట్రాతికిఁగల్గె భావన మరాతికి రాజ్యసుఖంబము గల్గె దు
ర్జాతికిఁబుణ్యమబ్బె గపిజాతిమహత్త్వము నొందెఁగావునం
దాతవ యెట్టివారలకు దాశరథీ! కరుణాపయోనిధీ! 52

ఉ. మామక పాతక వ్రజము మాన్పనగణ్యము చిత్రగుప్తు లే
మేమని వ్రాఁతురో శమనుఁడేమి విధించునొ కాలకింకర
స్తోమ మొనర్చుటేమొ వినఁ జొప్పడదింతకుమున్నె దీనచిం
తామణి యెట్లుగాచెదవొ దాశరథీ! కరుణాపయోనిధీ! 53

ఉ. దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు నీ
దాసుని దాసుడా గుహుడు తావక దాస్య మొసంగినావు నే
జేసినపాపమో వినుతి చేసిన గావవు గావుమయ్య నీ
దాసులలోన నేనొకఁడ దాశరథీ! కరుణాపయోనిధీ! 54

ఉ. దీక్షవహించి నా కొలది దీనుల నెందఱిఁ గాచితో జగ
ద్రక్షక తొల్లి యా ద్రుపదరాజతనూజ తలంచినంతనే
యక్షయమైన వల్వలిడి తక్కట నా మొఱఁజిత్తగించి ప్ర
త్యక్షము గావవేమిటికి దాశరథీ! కరుణాపయోనిధీ! 55

ఉ. నీలఘనాభమూర్తివగు నిన్నుఁగనుంగొనఁగోరి వేడినన్‌
జాలముసేసి డాగెదవు సంస్తుతికెక్కిన రామనామ మే
మూలను దాచుకోఁగలవు ముక్తికి బ్రాపది పాపమూలకు
ద్దాలముగాదె మాయెడల దాశరథీ! కరుణాపయోనిధీ! 56

చ. వలదు పరాకు భక్తజన వత్సల నీ చరితంబు వమ్ముగా
వలదు పరాకు నీ బిరుదు వజ్రమువంటిది కావకూరకే
వలదు పరాకు నా దురిత వార్ధికిఁదెప్పవుగా మనంబులో
దలఁతుమె కా నిరంతరము దాశరథీ! కరుణాపయోనిధీ! 57

ఉ. తప్పులెఱుంగలేక దురితంబులు సేసితినంటి నీవు మా
యప్పవుగావుమంటి నిఁక నన్యులకున్‌ నుదురంటనంటి నీ
కొప్పిదమైన దాసజను లొప్పిన బంటుకు బంటనంటి నా
తప్పులకెల్ల నీవెగతి దాశరథీ! కరుణాపయోనిధీ! 58

చ. ఇతఁడు దురాత్ముఁడంచు జనులెన్నఁగ నాఱడిఁగొంటి నేనెపో
పతితుఁడనంటిపో పతితపావనమూర్తివి నీవుగల్గ నే
నితరుల వేఁడనంటి నిహమిచ్చిన నిమ్ము పరంబొసంగు మీ
యతులిత రామనామ మధురాక్షరపాళి నిరంతరంబు హృ
ద్గతమని నమ్మికొల్చెదను దాశరథీ! కరుణాపయోనిధీ! 59

ఉ. అంచితమైన నీదు కరుణామృతసారము నాదుపైని బ్రో
క్షించినఁ జాలు దాన నిరసించెద నా దురితంబులెల్లఁ దూ
లించెదఁ వైరివర్గ మెడలించెదఁ గోర్కుల నీదుబంటనై
దంచెదఁ గాలకింకరుల దాశరథీ! కరుణాపయోనిధీ! 60

చ. జలనిధులేడునొక్క మొగిఁ జక్కికిఁదెచ్చె శరంబు ఱాతినిం
పలరగఁ జేసెనాతిగఁ బదాబ్జపరాగము నీ చరిత్రముం
జలజభవాది నిర్జరులు సన్నుతి సేయఁగ లేరు గావునం
దలఁప నగణ్యమయ్య యిది దాశరథీ! కరుణాపయోనిధీ! 61

ఉ. కోతికి శక్యమా యసుర కోటుల గెల్వను గెల్చెబో నిజం
బాతని మేన శీతకరుఁడౌట దవానలుఁడెట్టివింత మా
సీత పతివ్రతామహిమ సేవకు భాగ్యము మీ కటాక్షమున్‌
ధాతకు శక్యమా బొగడ దాశరథీ! కరుణాపయోనిధీ! 62

ఉ. భూపలలామ రామ రఘుపుంగవరామ త్రిలోకరాజ్య సం
స్థాపనరామ మోక్షఫలదాయకరామ మదీయపాపముల్‌
పాపఁగదయ్య రామ నినుఁ బ్రస్తుతిసేసెదనయ్య రామ సీ
తాపతి రామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! 63

ఉ. నీ సహజంబు సాత్త్వికము నీ విడిపట్టు సుధాపయోధి ప
ద్మాసనుఁడాత్మజుండు గమలాలయ నీ ప్రియురాలు నీకు సిం
హాసనమిద్ధరిత్రి గొడుగాకస మక్షులు చంద్రభాస్కరుల్‌
నీ సుమతల్పమాదిఫణి నీవె సమస్తముఁ గొల్చునట్టి నీ
దాసుల భాగ్యమెట్టిదయ దాశరథీ! కరుణాపయోనిధీ! 64

చ. చరణము సోఁకినట్టి శిల జవ్వనిరూపగు టొక్కవింత సు
స్థిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింతగాని మీ
స్మరణఁ దనర్చుమానవులు సద్గతిఁజెందిన దెంతవింత యీ
ధరను ధరాత్మజారమణ దాశరథీ! కరుణాపయోనిధీ! 65

ఉ. దైవము తల్లిదండ్రి తగుదాత గురుండు సఖుండు నిన్నె కా
భావన సేయుచున్న తఱిఁబాపములెల్ల మనోవికార దు
ర్భావితుఁజేయుచున్నవి కృపామతివై నను గావుమీ జగ
త్పావనమూర్తి భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! 66

ఉ. వాసవ రాజ్యభోగ సుఖవార్ధిని దేలు ప్రభుత్వమబ్బినా
ఉయాసకు మేరలేదు కనకాద్రిసమానధనంబు గూర్చినం
గాసును వెంటరాదు కని కానక చేసిన పుణ్యపాపముల్‌
వీసరబోవ నీవు పదివేలకుఁజాలు భవంబునొల్ల నీ
దాసునిగాఁగ నేలికొను దాశరథీ! కరుణాపయోనిధీ! 67

ఉ. సూరిజనుల్‌ దయాపరులు సూనృతవాదులలుబ్ధమానవుల్‌
వీరపతివ్రతాంగనలు విప్రులు గోవులు వేదముల్‌ మహీ
భారముఁ దాల్పఁగా జనులు పావనమైన పరోపకార స
త్కార మెఱుంగలే రకట దాశరథీ! కరుణాపయోనిధీ! 68

ఉ. వారిచరావతారమున వారధిలోఁ జొఱఁబాఱిఁ క్రోధ వి
స్తారగుడైన యా నిగమ తస్కరవీర నిశాచరేంద్రునిన్‌
జేరి వధించి వేదముల చిక్కెడలించి విరించికిన్‌ మహో
దారతనిచ్చితీవెగద దాశరథీ! కరుణాపయోనిధీ! 69

చ. కరమనురక్తి మందరము గవ్వముగా నహిరాజు ద్రాడుగా
దొరకొని దేవదానవులు దుగ్ధపయోధి మథించుచున్నచో
ధరణిచలింప లోకములు తల్లడమందఁగఁ గూర్మమై ధరా
ధరము ధరించితీవె కద దాశరథీ! కరుణాపయోనిధీ! 70

ఉ. ధారుణి జాపజుట్టిన విధంబునగైకొని హేమనేత్రుఁడ
వ్వారిధిలోన డాఁగినను వానివధించి వరాహమూర్తివై
ధారుణిఁ దొంటి కైవడిని దక్షిణశృంగమునన్‌ ధరించి వి
స్తార మొనర్చితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ! 71

చ. పెటపెట నుక్కు కంబమున భీకరదంత నఖాంకుర ప్రభా
పటలము గప్ప నుప్పతిలి భండనవీథి నృసింహభీకర
స్ఫుటపటుశక్తి హేమకశిపున్‌ విదలించి సురారిపట్టి నం
తటఁగృపఁజూచితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ! 72

చ. పదయుగళంబు భూగగన భాగములన్‌ వెసనూని విక్రమా
స్పదుఁడగు నబ్బలీంద్రునొక పాదమునం దలక్రిందనొత్తి మే
లొదవ జగత్త్రయంబు బురుహూతునికియ్య వటుండవైన చి
త్సదమలమూర్తి వీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ! 73

చ. ఇరువదియొక్కమాఱు ధరణీశుల నెల్ల వధించి తత్కళే
బర రుధిర ప్రవాహమునఁ బైతృకతర్పణ మొప్పఁజేసి భూ
సురవరకోటికిన్‌ ముదము సొప్పడ భార్గవరామమూర్తివై
ధరణినొసంగితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ! 74

చ. దురమునఁ దాటకం దునిమి ధూర్జటివిల్‌ దునుమాడి సీతనుం
బరిణయమంది తండ్రిపనుపన్‌ ఘనకాననభూమి కేఁగి దు
స్తరపటుచండ కాండకులిశాహతి రావణకుంభకర్ణ భూ
ధరములఁ గూల్చితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ! 75

చ. అనుపమ యాదవాన్వయసుధాబ్ధిసుధానిధి కృష్ణమూర్తి నీ
కనుజుఁడుగా జనించి కుజనావళి నెల్ల నడంచి రోహిణీ
తనయుఁడనంగ బాహుబల దర్పమునన్‌ బలరామమూర్తివై
తనరిన వేల్పవీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ! 76

చ. సురలునుతింపగాఁ ద్రిపుర సుందరులన్‌ వరియింప బుద్ధరూ
పరయఁగ దాల్చితీవు త్రిపురాసురకోటి దహించుచున్నప్పుడా
హరునకుఁ దోడుగా వరశరాసన బాణముఖోగ్రసాధనో
త్కర మొనరించితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ! 77

ఉ. సంకరదుర్గమై దురిత సంకులమైన జగంబుజూచి స
ర్వంకషలీల నుత్తమ తురంగమునెక్కి కరాసిఁబూని వీ
రాంక విలాసమొప్ప గలికాకృతి సజ్జనకోటికిన్‌ నిరా
తంక మొనర్చితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ! 78

చ. మనమున నూహపోహణలు మర్వకమున్నె కఫాదిరోగముల్‌
దనువుననంటి మేనిబిగి దప్పకమున్నె నరుండు మోక్ష సా
ధన మొనరింపఁగావలయుఁ దత్త్వవిచారము మానియుండుట
ల్తనువునకున్‌ విరోధమిది దాశరథీ! కరుణాపయోనిధీ! 79

చ. ముదమున కాటపట్టు భవమోహమద ద్విరదాంకుశంబు సం
పదల కొటారు కోరికల పంట పరంబునకాది వైరుల
న్నదన జయించుత్రోవ విపదబ్ధికి నావ గదా సదాభవ
త్సదమల నామసంస్మరణ దాశరథీ! కరుణాపయోనిధీ! 80

చ. దురితలతానుసారి భయదుఃఖకదంబము రామనామ భీ
కరతర హేతిచేఁదెగి వకావకలై చనకుండ నేర్చు నే
దరికొని మండుచుండు శిఖదార్కొనినన్‌ శలభాదికీటకో
త్కరము విలీనమై చనదె దాశరథీ! కరుణాపయోనిధీ! 81

చ. హరిపదభక్తి నింద్రియజయాన్వితుఁ డుత్తముఁడింద్రియంబులన్‌
మరుగక నిల్పనూదినను మధ్యముఁడింద్రియపారవశ్యుఁడై
పరగినచో నికృష్టుడని పల్కగ దుర్మతినైన నన్ను నా
దరమున నెట్లుకాచెదవొ దాశరథీ! కరుణాపయోనిధీ! 82

చ. వనకరిచిక్కె మైనసకు వాచవికిం జెడిపోయె మీను తా
వినికికిఁ జిక్కెఁ జిల్వ గనువేఁదుఱు జెందెను లేళ్ళు తావిలో
మనికినశించె దేఁటి తరమా యిరుమూఁటిని గెల్వనైదుసా
ధనములనీవె కావదగు దాశరథీ! కరుణాపయోనిధీ! 83

చ. కరములు మీకు మ్రొక్కులిడఁ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ
స్మరణఁ దనర్ప వీనులు భవత్కథలన్‌ వినుచుండ నాస మీ
యఱుతనుబెట్టు పూసరుల కాసగొనం బరమార్థ సాధనో
త్కరమిది చేయవే కృపను దాశరథీ! కరుణాపయోనిధీ! 84

చ. చిరతరభక్తి నొక్కతులసీదళ మర్పణ సేయువాఁడు ఖే
చరగరుడోరగ ప్రముఖసంఘములో వెలుఁగన్‌ సదాభవత్‌
స్ఫురదరవింద పాదములఁ బూజలొనర్చినవారికెల్లఁ ద
త్పర మఱచేతిధాత్రిగద దాశరథీ! కరుణాపయోనిధీ! 85

ఉ. భానుఁడు తూర్పునందు గనుపట్టినఁ బావక చంద్రతేజముల్‌
హీనతఁజెందినట్లు జగదేకవిరాజితమైన నీ పద
ధ్యానముచేయుచున్నఁ బరదైవమరీచులడంగకుండునే
దానవ గర్వనిర్దళన దాశరథీ! కరుణాపయోనిధీ! 86

ఉ. నీ మహనీయతత్త్వ రసనిర్ణయబోధకథామృతాబ్ధిలోఁ
దామును గ్రుంకులాడక వృథా తనుకష్టముజెంది మానవుం
డీ మహిలోకతీర్థములనెల్ల మునింగిన దుర్వికార హృ
త్తామసపంకముల్‌ విడునె దాశరథీ! కరుణాపయోనిధీ! 87

ఉ. కాంచన వస్తుసంకలిత కల్మషమగ్నిపుటంబు బెట్టి వా
రించినరీతి నాత్మనిగిడించిన దుష్కర దుర్మలత్రయం
బంచిత భక్తియోగ దహనార్చిఁ దగుల్పక పాయునే కన
త్కాంచనకుండలాభరణ దాశరథీ! కరుణాపయోనిధీ! 88

ఉ. నీ సతి పెక్కుగల్ములిడ నేర్పరి లోక మకల్మషంబుగా
నీ సుత సేయు పావనము నిర్మితి కార్యధురీణదక్షుఁడై
నీ సుతుఁడిచ్చు నాయువులు నిన్ను భజించినఁ గల్గకుండునే
దాసుల కీప్సితార్థములు దాశరథీ! కరుణాపయోనిధీ! 89

ఉ. వారిజపత్రమందిడిన వారివిధంబున వర్తనీయమం
దారయ రొంపిలోన దనువంటని కుమ్మర పుర్వురీతి సం
సారమునన్‌ మెలంగుచు విచారగుఁడై పరమొందుగాదె స
త్కారమెఱింగి మానవుఁడు దాశరథీ! కరుణాపయోనిధీ! 90

ఉ. ఎక్కడి తల్లితండ్రి సుతులెక్కడివారు కళత్రబాంధవం
బెక్కడ జీవుఁడెట్టి తనువెత్తినఁ బుట్టుచుఁ బోవుచున్నవాఁ
డొక్కఁడె పాపపుణ్యఫల మొందిననొక్కడె కానరాడు వే
ఱొక్కఁడు వెంటనంటిభవ మొల్లనయా కృపఁజూడవయ్య నీ
టక్కరి మాయలందిడక దాశరథీ! కరుణాపయోనిధీ! 91

ఉ. దొరసిన కాయముల్ముదిమి తోచినఁజూచి ప్రభుత్వముల్సిరుల్‌
మెఱపులుగాగజూచి మఱి మేదినిలోఁ దమతోడివారు ముం
దరుగుటచూచి చూచి తెగునాయువెఱుంగక మోహపాశము
ల్దరుఁగని వారికేమి గతి దాశరథీ! కరుణాపయోనిధీ! 92

చ. సిరిగలనాఁడు మైమఱచి చిక్కిననాఁడు దలంచి పుణ్యముల్‌
పొరిఁబొరి సేయనైతినని పొక్కినఁగల్గునె గాలిచిచ్చుపైఁ
గెరలినవేళఁ దప్పికొని కీడ్పడువేళ జలంబుగోరి త
త్తరమునఁ ద్రవ్వినంగలదె దాశరథీ! కరుణాపయోనిధీ! 93

ఉ. జీవనమింకఁ బంకమునఁ జిక్కినమీను చలింపకెంతయున్‌
దావుననిల్చి జీవనమె దద్దయుఁ గోరువిధంబు చొప్పడం
దావలఁమైనగాని గుఱి దప్పనివాఁడు తరించువాఁడయా
తావకభక్తియోగమున దాశరథీ! కరుణాపయోనిధీ! 94

చ. సరసుని మానసంబు సరసజ్ఞుఁడెఱుంగును ముష్కరాధముం
డెఱిఁగి గ్రహించువాడె కొలనేక నివాసముఁగాగ దర్దురం
బరయఁగ నేర్చునెట్లు వికచాబ్దమరంద రసైక సౌరభో
త్కరము మిళిందమొందు క్రియ దాశరథీ! కరుణాపయోనిధీ! 95

ఉ. నోఁచిన తల్లితండ్రికిఁ దనూభవుఁడొక్కడె చాలు మేటి చే
చాఁచనివాఁడు వేఱొకఁడు చాచిన లేదనకిచ్చువాఁడు నో
రాఁచి నిజంబకాని పలుకాడనివాఁడు రణంబులోన మేన్‌
దాఁచనివాఁడు భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! 96

ఉ. "శ్రీయుత జానకీరమణ చిన్మయరూప రమేశరామ నా
రాయణ పాహిపాహి"యని బ్రస్తుతిఁ జేసితి నా మనంబునం
బాయక కిల్బిష వ్రజ విపాటనమందఁగజేసి సత్కళా
దాయి ఫలంబు నాకియవె దాశరథీ! కరుణాపయోనిధీ! 97

ఉ. ఎంతటి పుణ్యమో శబరి యెంగిలిగొంటివి వింతగాదె నీ
మంతనమెట్టిదో యుడుతమైని కరాగ్ర నఖాంకురంబులన్‌
సంతసమందఁజేసితివి సత్కులజన్మమ దేమిలెక్క వే
దాంతముగాదె నీ మహిమ దాశరథీ! కరుణాపయోనిధీ! 98

ఉ. బొంకనివాఁడె యోగ్యుఁ డరిబృందము లెత్తినచోటఁ జివ్వకుం
జంకనివాఁడె జోదు రభసంబున నర్థికరంబు సాఁచినం
గొంకనివాఁడె దాత మిముఁ గొల్చి భజించినవాఁడె పో నిరా
తంకమనస్కుఁడెన్నగను దాశరథీ! కరుణాపయోనిధీ! 99

చ. భ్రమరము గీటకంబుఁగొని పాల్పడి ఝాంకరణోపకారియై
భ్రమరముగా నొనర్చునని పల్కుటఁజేసి భవాది దుఃఖసం
తమసమెడల్చి భక్తి సహితంబుగ జీవుని విశ్వరూప త
త్త్వమును ధరించుటేమరుదు దాశరథీ! కరుణాపయోనిధీ! 100

చ. తరువులు పూచి కాయలగు దత్కుసుమంబులు పూజగా భవ
చ్చరణము సోఁకి దాసులకు సారములౌ ధనధాన్యరాసులై
కరిభట ఘోటకాంబర నికాయములై విరజానదీసము
త్తరణ మొనర్చుఁజిత్రమిది దాశరథీ! కరుణాపయోనిధీ! 101

ఉ. పట్టితి భట్టరార్యగురు పాదములిమ్మెయి నూర్ధ్వపుండ్రముల్‌
వెట్టితి మంత్రరాజ మొడబెట్టితి నయ్యమకింకరాళికిం
గట్టితి బొమ్మ మీ చరణ కంజములందుఁ దలంపుపెట్టి బో
దట్టితిఁ బాపపుంజముల దాశరథీ! కరుణాపయోనిధీ! 102

ఉ. అల్లన లింగమంత్రిసుతుఁ డత్రిజ గోత్రజుఁడాదిశాఖ కం
చెర్లకులోద్భవుండనఁ బ్రసిద్ధుఁడనై భవదంకితంబుగా
నెల్లకవుల్‌ నుతింప రచియించితి గోపకవీంద్రుఁడన్‌ జగ
ద్వల్లభ నీకు దాసుఁడను దాశరథీ! కరుణాపయోనిధీ! 103Post a Comment

0 Comments