భాస్కరా శతకం
ఉ. శ్రీగల భాగ్యశాలి కడఁజేరఁగ వత్తురు తారు దారె దూ
రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వ ను
ద్యోగము చేసి; రత్ననిలయుండని కాదె సమస్తవాహినుల్
సాగరుఁ జేరుటెల్ల ముని సన్నుత! మద్గురుమూర్తి! భాస్కరా! 1
ఉ. అంగన నమ్మరాదు తన యంకెకు రాని మహాబలాఢ్యు వే
భంగుల మాయలొడ్డి చెఱుపం దలపెట్టు! వివేకియైన సా
రంగధరుం బదంబులు కరంబులు గోయఁగ జేసెఁ దొల్లి చి
త్రాంగి యనేకముల్ నుడువరాని కుయుక్తులు పన్ని భాస్కరా! 2
ఉ. అక్కరపాటు వచ్చు సమయంబునఁ జుట్టము లొక్కరొక్కరి
న్మక్కువ నుద్ధరించుటలు మైత్రికిఁ జూడఁగ యుక్తమే సుమీ
యొక్కట; నీటిలో మెరక నోడల బండ్లును బండ్లనోడలున్
దక్కక వచ్చుచుండుట నిదానము గాదె తలంప భాస్కరా! 3
చ. అడిగినయట్టి యాచకుల యాశలెఱుంగక లోభవర్తియై
కడపిన ధర్మదేవత యొకానొక యప్పుడు నీదు వాని కె
య్యెడల; నదెట్లు పాలు తమకిచ్చునె యెచ్చటనైన లేగలన్
గుడువఁగ నీనిచోఁ గెరలి గోవులు తన్నునుగాక భాస్కరా! 4
చ. అతిగుణహీన లోభికిఁ బదార్థము గల్గిన లేకయుండినన్
మితముగఁ గాని కల్మిగల మీఁదట నైన భుజింపఁడింపుగా
సతమని నమ్ము దేహమును సంపద; నేఱులు నిండి పాఱినన్
గతుకఁగ జూచుఁ గుక్క తన కట్టడ మీఱక యెందు భాస్కరా! 5
చ. అదను దలంచి కూర్చి ప్రజ నాదరమొప్ప విభుండు కోరినన్
గదిసి పదార్థమిత్తురటు కానగ వేగమె కొట్టి తెండనన్
మొదటికి మోసమౌఁ; బొదుగు మూలముగోసినఁ బాలు గల్గునే
పిదికినఁ గాక భూమిఁ బశుబృందము నెవ్వరికైన భాస్కరా! 6
చ. అనఘుని కైనఁ జేకుఱు ననర్హునిఁ గూడి చరించునంతలో
మన మెరియంగ నప్పుడవమానము కీడు ధరిత్రియందు నే
యనువునైనఁ దప్పవు యదార్థము; తానది యెట్టులన్నచో
నినుమును గూర్చి యగ్ని నలయింపదె సమ్మెటపెట్టు భాస్కరా! 7
చ. అలఘుగుణ ప్రసిద్ధుఁడగు నట్టి ఘనుండొకఁ డిష్టుఁడై తనున్
వలచి యొకించు కేమిడినవానికి మిక్కిలి మేలుచేయుఁగా;
తెలిసి కుచేలుఁ డొక్క కొణిదెం డడుకుల్ దనకిచ్చినన్ మహా
ఫలదుఁడు కృష్ణుఁడత్యధిక భాగ్యములాతని కీఁడె? భాస్కరా! 8
చ. అవనివిభుండు నేరుపరియై చరియించినఁ గొల్చువార లె
ట్లవగుణు లైననేమి? పనులన్నియుఁ జేకుఱు వారిచేతనే;
ప్రవిమలనీతిశాలి యగు రాముని కార్యము మర్కటంబులే
తవిలి యొనర్పవే జలధి దాఁటి సురారులఁ ద్రుంచి భాస్కరా! 9
ఉ. ఆదరమింత లేక నరుఁడాత్మబలోన్నతి మంచివారికి\న్
భేదము చేయుటం దనదు పేర్మికిఁ గీడగు మూలమె; ట్లమ
ర్యాద హిరణ్యపూర్వకశిపన్ దనుజుండు గుణాఢ్యుడైన ప్ర
హ్లాదున కెగ్గుచేసి ప్రళయంబును బొందఁడె మున్ను భాస్కరా! 10
ఉ. ఆరయ నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్న్
గౌరవమొప్పఁగూర్చు నుపకారి మనుష్యుఁడు లేక మేలు చే
కూరదదెట్లు; హత్తుగడ గూడునె; చూడఁ బదాఱువన్నె బం
గారములోన నైన వెలిగారము కూడక యున్న భాస్కరా! 11
ఉ. ఈ క్షితినర్థకాంక్ష మదినెప్పుడు పాయక లోకులెల్ల సం
రక్షకుఁడైన సత్ప్రభుని రాకలు గోరుదు రెందుఁ; జంద్రికా
పేక్షఁ జెలంగి చంద్రుఁడుదయించు విధంబునకై చకోరపుం
బక్షులు చూడవే యెదు రపార ముదంబును బూని భాస్కరా! 12
ఉ. ఈ జగమందు దా మనుజుఁడెంత మహాత్మకుఁడైన దైవమా
తేజము తప్పఁ జూచు నెడఁ ద్రిమ్మరి కోల్పడు; నెట్లన న్మహా
రాజకుమారుఁడైన రఘురాముఁడు గాల్నడఁ గాయలాకులున్
భోజనమై తగన్వనికిఁ బోయి చరింపఁడె మున్ను భాస్కరా! 13
చ. ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మ దలంచి యుగ్రవా
క్పరుషత జూపినన్ ఫలము గల్గుట తథ్యముగాదె; యంబుదం
బురిమినయంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ
స్థిరతరపౌరుషంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా! 14
చ. ఉరుగుణవంతుఁడొడ్లు తనకొం డపకారము చేయునప్పుడుం
బరహితమే యొనర్చు నొకపట్టున నైనను గీడుఁ జేయగా నెఱు
గఁడు; నిక్కమేకద యదెట్లన? గవ్వముఁ బట్టి యంతయుం
దరువఁగఁ జొచ్చినం బెరుగుతాలిమి నీయదె వెన్న? భాస్కరా! 15
చ. ఉరుబలశాలి నంచుఁ దను నొల్లని యన్య [పతివ్రతాంగనా
సురతము గోరెనేని కడసుమ్మది భూతికిఁ బ్రాణహాని యౌ;
శిరములు గూల రాఘవునిచే దశకంఠుఁడు ద్రుంగిపోవఁడే
యెఱుఁగక సీత కాసపడి యిష్టుల భృత్యులఁ గూడి భాస్కరా! 16
ఉ. ఊరక వచ్చుఁ బాటు పడకుండిననైన ఫలం బదృష్ట మే
పారఁగఁ గల్గువానికిఁ బ్రయాసము నొందిన దేవదానవుల్
వారలటుండఁగా నడుమ వచ్చిన శౌరికిఁ గల్గెఁ గాదె సృం
గారపుఁ బ్రోవు లక్ష్మియును గౌస్తుభరత్నము రెండు భాస్కరా! 17
ఉ. ఊరక సజ్జనుండొదిఁగి యుండిననైన దురాత్మకుండు ని
ష్కారణమోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా;
చీరలు నూరుటంకములు చేసెడివైనను బెట్టె నుండఁగాఁ
జేరి చినింగిపోఁ గొఱుకు చిమ్మట కేమి ఫలంబు? భాస్కరా! 18
ఉ. ఎట్టుగఁ బాటుపడ్డ నొక యించుక ప్రాప్తము లేక వస్తువుల్
పట్టుపడంగ నేరవు; నిబద్ధి సురావళిఁ గూడి రాక్షసుల్
గట్టు పెకల్చి పాల్కడలిఁ గవ్వముచేసి మథించి రంతయున్
వెట్టియె గాక యేమనుభవించిరి వారమృతంబు భాస్కరా! 19
చ. ఎడపక దుర్జనుండొరుల కెంతయుఁ గీడొనరించుఁ గాని యే
యెడలను మేలు సేయఁడొక యించుకయైనను; జీడపుర్వు దాఁ
జెడఁ దిను నెంతెకాక పుడుసెండు జలంబిడి పెంప నేర్చునే
పొడవగుచున్న పుష్పఫల భూరుహ మొక్కటినైన భాస్కరా! 20
ఉ. ఎడ్డె మనుష్యుఁడే మెఱుఁగు నిన్నె దినంబులు గూడి యుండినన్
దొడ్డ గుణాఢ్యునందుఁ గల తోరపు వర్తనలెల్ల బ్రజ్ఞఁ బే
ర్వడ్డ వివేకి రీతి; రుచిపాకము నాలుకగా కెఱుంగునే?
తెడ్డది కూరలోఁ గలయఁ ద్రిమ్మరుచుండిననైన భాస్కరా! 21
ఉ. ఎప్పుడదృష్టతా మహిమ యించుక పాటిలు నప్పుడింపు సొం
పొప్పుచు నుండుఁగాక యది యొప్పని రూపుమాయుఁగా
నిప్పున నంటియున్న యతి నిర్మలినాగ్ని గురుప్రకాశముల్
దప్పిన నట్టి బొగ్గునకు దా నలుపెంతయుఁ బుట్టు భాస్కరా! 22
ఉ. ఏగతిఁ బాటుపడ్డఁ గలదే భువి నల్పునకు\న్ సమగ్రతా
భోగము భాగ్యరేఖగల పుణ్యునకుంబలె; భూరి సత్త్వసం
యోగ మదేభ కుంభయుగళోత్థిత మాంసము నక్కకూనకే
లాగు ఘటించు! సింహము దలంచినఁ జేకురు గాక భాస్కరా! 23
ఉ. ఏడ ననర్హుఁడుండు నటకేఁగు ననర్హుఁడు నర్హుఁడున్నచోఁ
జూడగఁ నొల్లడెట్లన; నశుద్ధగుణస్థితి నీఁగ పూయముం
గూడిన పుంటిపై నిలువఁ గోరిన యట్టులు నిల్వ నేర్చునే
సూడిదఁ బెట్టు నెన్నుదుటి చొక్కపుఁ గస్తురి మీఁద భాస్కరా! 24
ఉ. ఏల సమస్త విద్యల నొకించుక భాగ్యము గల్గియుండినన్
జాలు, ననేక మార్గముల సన్నుతికెక్క నదెట్లొకో యనన్
రాలకు నేడ విద్యలు తిరంబుగ దేవరరూపు చేసినన్
వ్రాలి నమస్కరించి ప్రసవంబులు పెట్టరె మీఁద భాస్కరా! 25
ఉ. ఒక్కఁడె చాలు నిశ్చల బలోన్నతుఁ డెంతటి కార్యమైనఁ దాఁ
జక్క నొనర్పఁ; గౌరవులసంఖ్యులు పట్టిన ధేనుకోటలం
జిక్కఁగనీక తత్ప్రబల సేన ననేక శిలీముఖంబులన్
మొక్కపడంగఁ జేసి తుదముట్టఁడె యొక్కకిరీటి భాస్కరా! 26
ఉ. కట్టడ దప్పి తాము చెడు కార్యముఁ జేయుచు నుండిరేని దోఁ
బుట్టిన వారినైన విడిపోవుట కార్యము; దౌర్మదాంధ్యముం
దొట్టిన రావణాసురునితో నెడఁబాసి విభీషణాఖ్యుఁ డా
పట్టున రాముఁ జేరి చిరపట్టము గట్టుకొనండె భాస్కరా! 27
ఉ. కట్టడ యైనయట్టి నిజకర్మము చుట్టుచు వచ్చి యే గతం
బెట్టునొ పెట్టినయట్లనుభవింపక తీఱదు; కాళ్ళు మీఁదుగాఁ
గట్టుక వ్రేలుడంచుఁ దలక్రిందుగఁ గట్టిరె యెవ్వరైన నా
చెట్టున గబ్బిలంబులకుఁ జేసిన కర్మముగాక భాస్కరా! 28
ఉ. కట్టడ లేని కాలమున గాదు శుభం బొరులెంతవారు చే
పట్టిననైన మర్త్యునకు భాగ్యము రాదనుటెల్లఁ గల్లకా
దెట్టని పల్కినన్; దశరథేశ వసిష్ఠులు రామమూర్తికిన్
బట్టము కట్టఁ గోరి రది పాయక చేకుఱెనోటు భాస్కరా! 29
ఉ. కానగ చేరఁ బోలఁ డతికర్ముఁడు నమ్మిక లెన్ని చేసినం
దానది నమ్మి వానికడ డాయఁగ బోయిన హాని వచ్చు న
చ్చో నది యెట్లనం; గొఱఁకు చూపుచు నొడ్డిన బోను మేలుగా
బోనని కానకాసపడి పోవుచుఁ గూలదెఁ గొక్కు భాస్కరా! 30
ఉ. కాని ప్రయోజనంబు సమకట్టదు తా భువి నెంత విద్యవాఁ
డైనను దొడ్డరాజు కొడుకైన నదెట్లు; మహేశుపట్టి వి
ద్యానిధి సర్వవిద్యలకు, దానె గురుండు వినాయకుండు దా
నేనుఁగు రీతి నుండియు నదేమిటి కాడఁడు పెండ్లి? భాస్కరా! 31
ఉ. కామిత వస్తుసంపదలు గల్గు ఫలం బొరు లాసపడ్డచో
నేమియుఁ బెట్టఁడేని సిరి యేటికి నిష్ఫలమున్నఁ బోయినన్
బ్రామికపడ్డ; లోకులకుఁ బండగ నే మది యెండి పోవఁగా
నేమి ఫలంబు చేఁదు విడదెన్నటికైన ముసిండి భాస్కరా! 32
ఉ. కారణమైన కర్మములు కాక దిగంబడ వెన్ని గొందులం
దూఱిన నెంతవారలకుఁ; దొల్లి పరీక్షితు శాపభీతుఁడై
వారిధి నొప్పు నుప్పరిగ పైఁ బదిలంబుగ దాఁగి యుండినం
గ్రూరభుజంగ దంతహతిఁ గూలడె లోకులెఱుంగ భాస్కరా! 33
చ. కులమున నక్కడక్కడ నకుంఠిత ధార్మికుఁడొక్కఁడొక్కఁడే
కలిగెడుఁగాక పెందఱుచు గల్గగ నేరరు; చెట్టు చెట్టునన్
గలుగఁగ నేర్చునే? గొడుగు కామలు చూడఁగ నాడనాడ నిం
పలరఁగ నొక్కటొక్కటి నయంబునఁ జేకురుఁగాక భాస్కరా! 34
ఉ. క్రూర మనస్కులౌ పతులఁ గొల్చి వసించిన మంచివారికిన్
వారి గుణంబె పట్టి, చెడు వర్తన వాటిలు; మాధురీజలో
దారలు గౌతమీముఖమహానదు లంబుధిఁ గూడినంతనే
క్షారముఁ జెందవే మొదలి కట్టడ లన్నియుఁ దప్పి భాస్కరా! 35
ఉ. గిట్టుట కేడఁ గట్టడ లిఖించిన నచ్చటఁ గాని యెండుచోఁ
బుట్టదు చావు; జానువుల పున్కల నూడిచి కాశిఁ జావఁగా
ల్గట్టిన శూద్రకున్ భ్రమలఁ గప్పుచుఁ దద్విధి గుఱ్ఱమౌచు నా
పట్టునఁ గొంచు మఱ్ఱికడఁ బ్రాణము దీసెగదయ్య! భాస్కరా! 36
చ. ఘనబలసత్త్వ మచ్చుపడఁ గల్గిన వానికి హాని లేనిచోఁ
దనదగు సత్త్వమే చెరచుఁ దన్ను; నదెట్లన నీరు మిక్కిలిన్
గినుక వసించినన్ జెఱువు కట్టకు సత్వము చాలకున్నచోఁ
గనుమలు పెట్టి నట్టనడి గండి తెగంబడకున్నె భాస్కరా! 37
చ. ఘనుఁడగు నట్టివాఁడు నిజకార్య సముద్ధరణార్థమై మహిం
బనివడి యల్పమానవునిఁ బ్రార్థనఁ జేయుట తప్పుగాదుగా;
యనఘతఁ గృష్ణజన్మమున నా వసుదేవుఁడు మీఁద టెత్తుగాఁ
గనుఁగొని గాలిగాని కడ కాళ్ళకు మ్రొక్కఁడె నాఁడు భాస్కరా! 38
చ. ఘనుఁడొకవేళ గీడ్పడిన గ్రమ్మఱ నాతని లేమిఁ బాపఁగా
గనుగొన నొక్క సత్ప్రభువుఁగాక నరాధము లోపరెందరుం;
బెనుఁ జెఱువెండినట్టి తఱిఁ బెల్లున మేఘుఁడు గాక నీటితోఁ
దనుపఁ దుషారముల్ శతశతంబులు చాలునటయ్య భాస్కరా! 39
ఉ. చంద్రకళావతంసు కృపచాలనినాఁడు మహాత్ముఁడైనఁ దా
సాంద్రవిభూతిఁ బాసి యొక జాతివిహీనునిఁ గొల్చియుంట యో
గీంద్ర నుతాంఘ్రి పద్మ మతిహీనత నొందుట కాదుగా; హరి
శ్చంద్రుఁడు వీరబాహుని నిజంబుగఁ గొల్వఁడె నాఁడు భాస్కరా! 40
ఉ. చక్కఁదలంపఁగా విధివశంబున నల్పుని చేతనైనఁ దా;
జిక్కి యవస్థలం బొరలుఁ జెప్పఁగరాని మహాబలాఢ్యుఁడున్
మిక్కిలి సత్త్వ సంపదల మీఱిన గంధగజంబు మావటీఁ
డెక్కి యదల్చి కొట్టి కుదియించిన నుండదె యోర్చి భాస్కరా! 41
చ. చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం;
బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా! 42
ఉ. చాలఁ బవిత్రవంశమున సంజనితుండగునేని యెట్టి దు
శ్శీలునినైనఁ దత్కుల విశేషముచే నొక పుణ్యుఁడెంతయుం
దాలిమి నుద్ధరించును; సుధానిధిఁ బుట్టగఁగాదె శంభుఁడా
హాలాహలానలంబు గళమందు ధరించుట పూని భాస్కరా! 43
ఉ. చేరి బలాధిపుం డెరిఁగి చెప్పిన కార్యము చేయకుండినన్
బారము ముట్టలేఁడొక నెపంబున దాఁజెడు నెట్టి ధన్యుఁడున్
బోరక పాండుపుత్రులకు భూస్థలిభాగము పెట్టుమన్న కం
సారిని గాకుచేసి చెడఁడాయెనె కౌరవభర్త భాస్కరా! 44
ఉ. చేసిన దుష్టచేష్ట నది చెప్పక నేర్పునఁ గప్పిపుచ్చి తా
మూసిన యంతటన్ బయలు ముట్టక యుండ దదెట్లు; రాగిపైఁ
బూసిన బంగరుం జెదరిపోవఁ గడంగిన నాఁడు నాటికిన్
దాసిన రాగి గానఁబడ దా జనులెల్ల రెఱుంగ భాస్కరా! 45
చ. తగిలి మదంబుచే నెదిరిఁ దన్ను నెఱుంగక దొడ్డవానితో
బగఁగొని పోరుటెల్ల నతిపామరుడై చెడుటింతెగాక తా
నెగడి జయింపనేరఁడది నిక్కము తప్పదు; ధాత్రిలోపలన్
దెగి యొక కొండతో దగరు ఢీకొని తాఁకిన నేమి భాస్కరా! 46
చ. తడవగ రాదు దుష్టగుణుఁ దత్వ మెఱుంగక యెవ్వరైన నా
చెడుగుణ మిట్లు వల్వదని చెప్పిన గ్రక్కున గోపచిత్తుఁడై
కడుఁ దెఁగఁ జూచుఁగా; మఱుగఁ గాగిన తైలము నీటిబొట్టుపై
బడునెడ నాక్షణంబెగసి భగ్గున మండక యున్నె భాస్కరా! 47
చ. తనకు ఫలంబు లేదని యెదం దలపోయఁడు కీర్తి గోరు నా
ఘన గుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మే
లనుకొని పూను; శేషుఁడు సహస్ర ముఖంబుల గాలి గ్రోలి తా
ననిశము మోవఁడే మఱి మహాభరమైన ధరిత్రి భాస్కరా! 48
చ. తనకు నదృష్టరేఖ విశదంబుగఁ గల్గిన గాని లేనిచో
జనునకు నెయ్యెడన్ బరుల సంపదవల్ల ఫలంబు లేదుగా;
కనుగవ లెస్సఁగా దెలివి గల్గిన వారికి గాక గ్రుడ్డికిన్
కనఁబడు నెట్లు వెన్నెలలుఁ గాయగ నందొక రూపు భాస్కరా! 49
ఉ. తాలిమితోడుతం దగవు దప్పక నేర్పరి యొప్పుదప్పులం
బాలన సేయఁ గాకట నుపాయ విహీనుఁడు సేయనేర్చునే?
పాలను నీరు వేఱు పరుపంగ మరాళ మెఱుంగుఁగాని మా
ర్జాలమెఱుంగునే తదురు చారురసజ్ఞత బూన భాస్కరా! 50
ఉ. తాలిమితోఁడ గూరిమిఁ గృతఘ్నునకెయ్యెడ నుత్తమోత్తముల్
మేలొనరించినన్ గుణము మిక్కిలి కీడగుఁ, బాముపిల్లకున్
బాలిడి పెంచిన న్విషము పాయఁగ నేర్చునె దాని కోఱలం
జాలఁగ నంతకంత కొక చాయను, హెచ్చును గాక భాస్కరా! 51
చ. తెలియని కార్యమెల్లఁ గడతేర్చుట కొక్క వివేకిఁ జేకొనన్
వలయు నటైన దిద్దుకొనవచ్చు ప్రయోజన మాంద్య మేమియుం
గలగదు; ఫాలమందుఁ దిలకం బిడునప్పుడు చేత నద్దముం
గలిగినఁ జక్కఁ జేసికొనుఁ గాదె నరుండది చూచి భాస్కరా! 52
ఉ. దక్షుడు లేని యింటికిఁ బదార్థము వేఱొక చోటనుండి వే
లక్షలు వచ్చుచుండినఁ బలాయనమై చనుఁ, గల్ల గాదు ప్ర
త్యక్షము; వాగులున్ వఱదలన్నియు వచ్చిన నీరు నిల్చునే
అక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా! 53
ఉ. దానపరోపకారగుణ ధన్యత చిత్తములోన నెప్పుడున్
లేని వివేకశూన్యునకు లేములు వచ్చినవేల సంపదల్
పూనినవేళ నొక్కసరి పోలును; జీఁకున కర్థరాత్రియం
దైననదేమి పట్టపగలైన నదేమియు లేదు భాస్కరా! 54
ఉ. దానము సేయఁ గోరిన వదాన్యున కీయఁగ శక్తి లేనిచో
నైనఁ బరోపకారమునకై యొక దిక్కునఁ దెచ్చి యైన నీఁ
బూనును; మేఘుడంబుధికిఁ బోయి జలంబులఁ దెచ్చి యీయఁడే
వాన సమస్త జీవులకు వాంఛిత మింపెసలార భాస్కరా! 55
ఉ. దానముఁ జేయనేరని యధార్మికు సంపద యుండి యుండియున్
దానె పలాయనంబగుట తథ్యము; బూరుగు మ్రాను గాచినన్,
దాని ఫలంబులూరక వృథాపడిపోవవె యెండి గాలిచేఁ
గానలలోన నేమిటికిఁగాక, యభోజ్యములౌట భాస్కరా! 56
చ. నడవక చిక్కిలేమి యగునాఁడు నిజోదర పోషణార్థమై
యడిగి భుజించుటల్ నరుల కారయ వ్యంగ్యముకాదు; పాండవుల్
గడు బలశాలులేవురు నఖండవిభూతిఁ దొలంగి భైక్ష్యముల్
గుడువరె యేకచక్రపురిఁ గుంతియుఁ దారొకచోట భాస్కరా! 57
చ. నుడువుల నేర్పు చాలని మనుష్యుఁడెఱుంగక తప్పనాడినం
గడుఁ గృపతోఁ జెలంగుదురు కాని యదల్పరు తజ్ఞులెల్లఁ; ద
ప్పటడుగులు వెట్టుచు న్నడుచునప్పుడు బాలుని ముద్దు చేయఁగా
దొడుగుదు రింతెకాని పడఁద్రోయుదురే యెవరైన భాస్కరా! 58
ఉ. నేరిచి బుద్ధిమంతుఁడతి నీతివివేకము దెల్పినం జెడం
గారణమున్నవాని కది కైకొనఁగూడదు నిక్కమే; దురా
చారుఁడు రావణాసురుఁడసహ్యమునొందఁడె చేటుకాలముం
జేరువయైననాఁడు నిరసించి విభీషణు బుద్ధి భాస్కరా! 59
చ. నొగిలిన వేళ నెంతటి ఘనుండును దన్నొక రొక్క నేర్పుతో
నగపడి ప్రోదిసేయక తనంతట బల్మికిరాడు నిక్కమే;
జగమున నగ్నియైనఁ గడు సన్నగిలంబడియున్న, నింధనం
బెగయగఁ ద్రోచి యూదక మఱెట్లు రవుల్కొన నేర్చు భాస్కరా! 60
ఉ. పండితులైనవారు దిగువం దగనుండగ, నల్పుఁ డొక్కడు
ద్ధండతఁ బీఠమెక్కిన బుధ ప్రకరంబులకేమి యెగ్గగున్;
కొండొకకోతిఁ జెట్టు కొనకొమ్మల నుండగ, గ్రింద గండ భే
రుండ మదేభ సింహనికురంబములుండవె చేరి భాస్కరా! 61
ఉ. పట్టుగ నిక్కుచున్ మదముఁ బట్టి మహాత్ములఁ దూలనాడినం
బట్టిన కార్యముల్ చెడును బ్రాణమువోవు నిరర్థదోషముల్
పుట్టు, మహేశుఁ గాదని కుబుద్ధి నొనర్చిన యజ్ఞ తంత్రముల్
ముట్టక పోయి దక్షునికి మోసము వచ్చెఁగదయ్య భాస్కరా! 62
చ. పరహితమైన కార్య మతిభారము తోడిదియైనఁ బూను స
త్పురుషుఁడు లోకముల్పొగడఁ బూర్వమునందొక ఱాలవర్షమున్
గురియఁగ జొచ్చినన్ గదిసి గొబ్బున గోజనరక్షణార్థమై
గిరినొక కేల నెత్తెనట కృష్ణుఁడు ఛత్రము భాతి భాస్కరా! 63
చ. పలుచని హీనమానవుఁడు పాటిఁదలంపక నిష్ఠురోక్తులం
బలుకుచు నుండుఁగాని, మతి భాసురుఁడైన గుణప్రపూర్ణుఁడ
ప్పలుకులఁ బల్కఁబోవఁడు నిబద్ధిగ నెట్లన; వెల్తికుండఁ దా
దొలకుచునుండుఁ గాని మఱితొల్కునె నిండుఘటంబు భాస్కరా! 64
చ. పలుమఱు సజ్జనుండు ప్రియభాషలె పల్కుఁ గఠోరవాక్యముల్
బలుకఁడొకానొకప్పుడు నవి పల్కినన్‌ఁ గీడును గాదు నిక్కమే;
చలువకు వచ్చి మేఘుఁడొక జాడను దా వడగండ్ల రాల్చినన్
శిలలగు నోటు వేగిరమె శీతలనీరము గాక భాస్కరా! 65
ఉ. పాపపుఁ ద్రోవవాని కొకపట్టున మేను వికాసమొందినన్
లోపల దుర్గుణంబె ప్రబలుం గద! నమ్మగఁ గూడ దాతనిన్;
బాపటకాయకున్ నునుపు పైపయి గల్గినఁ గల్గుగాక యే
రూపున దానిలోఁగల విరుద్ధపుఁ జేదు నశించు భాస్కరా! 66
ఉ. పూనిన భాగ్యరేఖ చెడిపోయిన పిమ్మట నెట్టిమానవుం
డైనను వాని నెవ్వరుఁ బ్రియంబునఁ బల్కరు పిల్వరెచ్చటం
దానది యెట్లొకో యనినఁ దథ్యము పుష్పమువాడి వాసనా
హీనత నొంది యున్న యెడ నెవ్వరు ముట్టుదురయ్య భాస్కరా! 67
ఉ. పూరిత సద్గుణంబు గల పుణ్యున కించుక రూప సంపదల్
దూరములైన వాని యెడ దొడ్డగఁ జూతురు బుద్ధిమంతు లె
ట్లారయ; గొగ్గులైన మఱి యందుల మాధురి చూచి కాదె ఖ
ర్జూర ఫలంబులం ప్రియము చొప్పడ లోకులు గొంట భాస్కరా! 68
ఉ. ప్రల్లదనంబుచే నెఱుక పాటొక యింతయులేక యెచ్చటన్
బల్లిదుఁడైన సత్ప్రభు నబద్ధములాడినఁ గ్రుంగిపోదు; రె
ట్లల్ల సభాస్థలిం గుమతులై శిశుపాలుఁడు దంతవక్త్రుఁడుం
గల్లలు గృష్ణునుం బలికి కాదె హతంబగుటెల్ల భాస్కరా! 69
ఉ. ప్రేమను గూర్చి యల్పునకుఁ బెద్దతనంబును దొడ్డవానికిం
దా మతితుచ్ఛపుంబని నెదం బరికింపగ యీయరాదుగా
వామకరంబుతోడఁ గడువం గుడిచేత నపానమార్గముం
దోమఁగ వచ్చునే మిగులఁ దోఁచని చేఁతగు గాక భాస్కరా! 70
చ. ఫలమతి సూక్ష్మమైనను నృపాలుడు మంచిగుణాఢ్యుడైనచో
నెలమి వివేకులాతని కపేక్షయొనర్తు; రదెట్లు చంద్రికా
విలసనమైనఁ దా మనుభవింపఁ జకోరము లాసఁ జేరవే
చలువ గలట్టివాఁడగుటఁ జందురు నెంతయుఁ గోరి భాస్కరా! 71
ఉ. బంధుర సద్గుణాఖ్యుఁ డొక పట్టున లంపట నొందియైన దు
స్సంధిఁ దలంపఁ డన్యులకుఁ జాల హితం బొనరించుఁ గాక, శ్రీ
గంధపుఁ జెక్క రాగిలిచుఁ గాదె శరీరుల కుత్సవార్థమై
గంధములాత్మఁ బుట్టఁ దఱుఁగంబడి యుండుటలెల్ల భాస్కరా! 72
చ. బలము దొలంగు కాలమునఁ బ్రాభవసంపదలెంత ధన్యుఁడున్
నిలుపుకొనంగనోపఁ; డది నిశ్చయ మర్జునుఁడీశ్వరాదులం
గెలిచినవాఁడు బోయలకు గీడ్పడి చూచుచుఁ గృష్ణభార్యలు
బలువుర నీయఁడే నిలువఁ బట్ట సమర్థుఁడు గాక భాస్కరా! 73
చ. బలయుతుఁ డైన వేళ నిజ బంధుఁడు తోడ్పడుఁ గాని యాతఁడే
బలము తొలంగెనేని తన పాలిటి శత్రు; వదెట్లు పూర్ణుఁడై
జ్వలనుఁడు కానఁ గాల్చు తఱి సఖ్యముఁ జూపును వాయుదేవుఁడా
బలియుఁడు సూక్ష్మదీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా! 74
ఉ. బల్లిదుఁడైన సత్ప్రభువు పాయక యుండినఁగాని రచ్చలోఁ
జిల్లరవారు నూఱుగురు సేరినఁ దేజము గల్గదెయ్యెడన్
జల్లని చందురుండెడసి సన్నపుఁ జుక్కలు కోటియున్న
జిల్లునె వెన్నెలల్ జగము జీఁకటులన్నియుఁ బాయ భాస్కరా! 75
చ. భుజబల శౌర్యవంతులగు పుత్త్రుల గాంచిన వారి కెయ్యెడన్
నిజహృదయేప్సితార్థములు నిక్కము చేకుఱుఁ గుంతిదేవికిన్
విజయబలాఢ్యుఁ డర్జునుఁడు వీరపరాక్రమ మొప్ప దేవతా
గజమును దెచ్చి తల్లి వ్రతకార్యము దీర్పఁడె తొల్లి భాస్కరా! 76
ఉ. భూనుతులైన దేవతలు పూర్వము కొందఱు వావివర్తనల్
మాని చరింపరో యనుచు మానవులట్ల చరింపఁబోల; దం
భోనిధులన్నియుం దనదు పుక్కిటఁ బట్టె నగస్త్యుఁడంచు నా
పూనిక కెవ్వఁడోపు నది పూర్వమహత్త్వము సుమ్ము భాస్కరా! 77
ఉ. భూపతి కాత్మబుద్ధి మది బుట్టనిచోఁట బ్రధానులెంత ప్ర
జ్ఞాపరిపూర్ణులైనఁ గొనసాగదు కార్యము; కార్యదక్షులై
యోపిన ద్రోణ భీష్మ కృప యోధులనేకులు గూడి కౌరవ
క్ష్మాపతికార్యమేమయినఁ జాలిరె చేయఁగ నాడు భాస్కరా! 78
ఉ. భూరి బాలాఢ్యుఁడైనఁ దలపోయక విక్రమశక్తిచే నహం
కారము నొందుటల్ తగవు గాదతఁడొక్కెడ మోసపోవుఁ గా
వీరవరేణ్యుఁ డర్జునుఁడు వింటికి నే నధికుండ నంచుఁ దా
నూరక వింటినెక్కిడఁగ నోపడు కృష్ణుఁడు లేమి భాస్కరా! 79
ఉ. భ్రష్టున కర్థవంతులగు బాంధవులెందఱు గల్గినన్ నిజా
దృష్టము లేదు గావున దరిద్రతఁ బాపఁగలేరు; సత్కృపా
దృష్టిని నిల్పి లోకుల కతిస్థిరసంపద లిచ్చు లక్ష్మి యా
జ్యేష్ట కదేటికిం గలుగఁజేయదు తోడనె పుట్టి భాస్కరా! 80
చ. మదిఁ దను నాసపడ్డయెడ మంచిగుణోన్నతుఁడెట్టి హీనునిన్
వదలఁడు మేలుపట్టున నవశ్యము మున్నుగ నాదరించుఁగా;
త్రిదశ విమానమధ్యమునఁ దెచ్చి కృపామతి సారమేయమున్
మొదల నిడండె ధర్మజుఁడు మూఁగి సురావళి చూడ భాస్కరా! 81
ఉ. మాటల కోర్వజాలఁ డభిమానసమగ్రుఁడు ప్రాణహానియౌ
చోటులనైనఁ దానెదురు చూచుచునుండుఁ; గొలంకు లోపల
న్నీట మునింగినప్పు డతి నీచము లాడిన రాజరాజు పో
రాట మొనర్చి నేలఁబడఁడాయెనె భీముని చేత భాస్కరా! 82
ఉ. మానవనాథుఁ డాత్మరిపు మర్మ మెఱింగినవాని నేలినం
గాని జయింపలేఁ డరులఁ; గార్ముకదక్షుఁడు రామభద్రుఁ డా
దానవనాయకున్ గెలువఁ దా నెటులోపుఁ దదీయ నాభికా
పానసుధ న్విభీషణుఁడు తార్కొని చెప్పకయున్న భాస్కరా! 83
ఉ. మానవుఁ డాత్మకిష్టమగు మంచిప్రయోజన మాచరించుచోఁ
గానక యల్పుఁడొక్కఁ డది గాదని పల్కిన వాని పల్కుకై
మానగఁజూడఁడా పని సమంచిత భోజనవేళ నీఁగ కా
లూనిన వంటకంబు దినకుండఁగ నేర్పగునోటు భాస్కరా! 84
ఉ. మానిని చెప్పు నెట్లెఱుకమాలిన వాఁడటు చేసినన్ మహా
హాని ఘటించు నే ఘనునికైన నసంశయ ముర్విపైఁ గృపా
హీనతఁ బల్కినన్; దశరథేశ్వరుఁ డంగన మాటకై గుణాం
భోనిధి రాముఁ బాసి చనిపోవఁడె శోకముతోడ భాస్కరా! 85
చ. మునుపొనరించు పాతక మమోఘము జీవులకెల్లఁ బూని యా
వెనుకటి జన్మమం దనుభవింపక తీఱదు; రాఘవుండు వా
లిని బడనేసి తా మగుడ లీల యదూద్భవుఁడై కిరాతుచే
వినిశిత బాణపాతమున వీడ్కొనఁడే తన మేను భాస్కరా! 86
ఉ. రాకొమరుల్ రసజ్ఞునిఁ దిరంబుగ మన్నన నుంచినట్లు భూ
లోకమునందు మూఢుఁ దమ లోపలనుంపరు; నిక్కమే కదా!
చేకొని ముద్దుగాఁ జదువు చిల్కను బెంతురుగాక పెంతురే
కాకము నెవ్వరైన శుభకారణ సన్మునిసేవ్య భాస్కరా! 87
ఉ. లోకములోన దుర్జనుల లోఁతు నెఱుంగక చేరరాదు సు
శ్లోకుఁడు చేరినం గవయఁజూతురు చేయుదు రెక్కసక్కెముల్
కోకిలఁ గన్నచోట గుమికూడి యసహ్యపుఁ గూతలార్చుచుం
గాకులు తన్నవే తఱిమి కాయము తల్లడమంద భాస్కరా! 88
ఉ. లోను దృఢంబుగాని పెనులోభిని నమ్మి యసాధ్యకార్యముల్
కానక పూనునే నతఁడు గ్రక్కునఁ గూలును; నోటిపుట్టిపై
మానవుఁ డెక్కిపోవ నొకమాటు బుటుక్కున ముంపకుండునే
తానొకలోఁతునం గెడసి దానిఁ దరింపఁగ లేక భాస్కరా! 89
ఉ. వంచన యింతలేక యెటువంటి మహాత్ముల నాశ్రయించినం
గొంచెమె కాని మేలు సమకూడ దదృష్టము లేనివారికిన్;
సంచితబుద్ధి బ్రహ్మ ననిశంబును వీఁపున మోచునట్టి రా
యంచకుఁ దమ్మితూండ్లు దిననాయెఁగదా ఫలమేమి భాస్కరా! 90
ఉ. వట్టుచుఁ దండ్రి యత్యధమ వర్తనుఁడైననుగాని వానికిం
బుట్టిన పుత్త్రకుండు తన పుణ్యవశంబున దొడ్డధన్యుఁడౌ;
నెట్టన మఱ్ఱివిత్తు మునుపెంతయుఁ గొంచెము దానఁబుట్టునా
చెట్టు మహోన్నతత్వమును జెందదె శాఖలనిండి భాస్కరా! 91
చ. వలనుగఁ గానలందుఁ బ్రతివర్షమునం బులి నాలుగైదు పి
ల్లలఁ గను దూడనొక్కటి నిలం గను ధేనువు రెండుమూఁడు నేఁ
డుల కటులైన బెబ్బులి కుటుంబము లల్పములాయె నాలమం
దలు గడువృద్ధిఁ జెందవె యధర్మము ధర్మముఁ దెల్ప భాస్కరా! 92
చ. వలవదు క్రూరసంగతి యవశ్య మొకప్పుడు సేయఁబడ్డచోఁ
గొలదియెఁ గాని యెక్కువలు గూడవు; తమ్ములపాకు లోపలం
గలసిన సున్నమించుకయ కాక మఱించుక యెక్కువైనచో
నలుగడఁ జుఱ్ఱుచుఱ్ఱుమని నాలుక పొక్కక యున్నె భాస్కరా! 93
ఉ. వానికి విద్యచేత సిరివచ్చె నటంచును విద్య నేర్వఁగాఁ
బూనినఁ బూనుఁగాక తన పుణ్యము చాలక భాగ్యరేఖకుం
బూనఁగ నెవ్వఁడోపు; సరిపో చెవి పెంచును గాకదృష్టతా
హీనుఁడు కర్ణభూషణము లెట్లు గడింపఁగనోపు? భాస్కరా! 94
ఉ. సంతత పుణ్యశాలి నొక జాడను సంపద వాసిపోయి తా
నంతటఁ బోక నెట్టుకొని యప్పటియట్ల వసించియుండు; మా
సాంతమునందుఁ జందురుని నన్నికళల్ పెడఁబాసి పోయినం
గాంతి వహింపఁడటోటు? తిరుగంబడి దేహమునిండ భాస్కరా! 95
చ. సకలజన ప్రియత్వము నిజంబుగఁ గల్గిన పుణ్యశాలి కొ
క్కొకయెడ నాపదైనఁ దడవుండదు వేగమె పాసిపోవుగా;
యకలుషమూర్తియైన యమృతాంశుఁడు రాహువు తన్ను మ్రింగినం
డకటక మాని యుండఁడె! దృఢస్థితి నెప్పటియట్ల భాస్కరా! 96
చ. సన్నుత కార్యదక్షుఁడొక చాయ నిజప్రభ యప్రకాశమై
యున్నపుడైన లోకులకు నొండక మేలొనరించు సత్త్వసం
పన్నుఁడు భీముఁడా ద్విజుల ప్రాణము కాఁవడె యేకచక్రమం
దెన్నికగా బకాసురుని నేపున రూపడఁగించి భాస్కరా! 97
చ. సరసగుణ ప్రపూర్ణునకు సన్నపు దుర్గుణ మొక్కవేళ యం
దొరసిన నిటు నీకుఁ దగునో యని చెప్పిన మాన నేర్చుగా
బురద యొకించుకంత తముఁ బొందిన వేళలఁ జిల్లవిత్తుపై
నొరసిన నిర్మలత్వమున నుండవె నీరములెల్ల భాస్కరా! 98
చ. సరసదయాగుణంబుగల జాణ మహిం గడు నొచ్చియుం
దఱచుగ వాని కాసపడి దాయఁగ వత్తురు లోకులెట్లనం
జెఱకురసంబు గానుఁగను జిప్పిలిపోయిన మీదఁ బిప్పియై
ధరఁ బడియున్నఁ జేరవె ముదంబునఁ జీమలు పెక్కు భాస్కరా! 99
ఉ. సారవివేకవర్తనల సన్నుతికెక్కిన వారిలోపలం
జేరినయంత మూఢులకుఁ జేపడ దానడ; యెట్టులన్నఁ గా
సారములోన హంసముల సంగతి నుండెడి కొంగపిట్ట కే
తీరునఁ గల్గ నేర్చును దదీయగతుల్ దలపోయ భాస్కరా! 100
ఉ. స్థానముఁ దప్పివచ్చునెడఁ దానెటువంటి బలాఢ్యుఁడున్ నిజ
స్థానికుఁడైన యల్పుని కతంబున నైనను మోసపోవుఁగా;
కానల లోపలన్ వెడలి గంధగజం బొకనాఁడు నీటిలోఁ
గానక చొచ్చినన్ మొసలి కాటుకు లోఁబడదటోటు భాస్కరా! 101
చ. సిరిగలవాని కెయ్యెడలఁ జేసిన మేలది నిష్ఫలం బగున్
నెఱిగుఱి గాదు పేదలకు నేర్పునఁ జేసిన సత్ఫలంబగున్
వఱపున వచ్చి మేఘుఁడొక వర్షము వాడిన చేలమీఁదటం
గురిసినఁగాక యంబుధులఁ గుర్వఁగ నేమి ఫలంబు భాస్కరా! 102
చ. సిరివలెనేని సింహగుహ చెంత వసించినఁ జాలు సింహముల్
కరుల వధింపఁగా నచటఁ గల్గును దంతచయంబు ముత్యముల్
హరువుగ నక్కబొక్క కడ నాశ్రయమందిన నేమి గల్గెడుం
గొరిసెలు దూడతోఁకలును గొమ్ములు నెమ్ములుఁగాక భాస్కరా! 103
చ. స్థిరతర ధర్మవర్తన బ్రసిద్ధికి నెక్కినవాని నొక్క ము
ష్కరుఁ డతినీచవాక్యములఁ గాదని పల్కిన నమ్మహాత్ముఁడుం
గొఱఁత వహింపఁడయ్యెడ; నకుంఠిత పూర్ణసుధాపయోధిలో
నరుగుచుఁ గాకి రెట్ట యిడినందున నేమి కొఱంత భాస్కరా! 104
చ. స్ఫురతర కీర్తిమంతులగు పుత్త్రుల గాంచినఁగాక మూఢము
ష్కరులఁ గనంగఁ దేజములు గల్గవుగా; మణికీలితాంగుళా
భరణము లంగుళంబుల శుభస్థితిఁ బెట్టినఁగాక గాజు టుం
గరములు పెట్టినందున వికాసము గల్గునటయ్య? భాస్కరా! 105
ఉ. సేనగ వాంఛితాన్నము భుజింపఁగలప్పుడు కాక లేనిచో
మేనులు డస్సియుంట నిజమేకద దేహుల కగ్నిహోత్రుఁడౌ
నే నిజభోజ్యముల్ గుడుచు నేనియుఁ బుష్టి వహించు లేనిఁనా
డూని విభూతిలోనడఁగి యుండఁడె తేజము తప్పి భాస్కరా! 106
ఉ. హాళి నిజప్రబుద్ధి తిరమైన విధంబునఁ బెట్టుబుద్ధులా
వేళలకంతె కాని మఱి వెన్కకు నిల్వవు; హేమకాంతి యె
న్నాళులకుండుఁ గాని యొకనాడు పదంపడి సానఁ బట్టినన్
దాళియు నుండునే యినుప తాటకఁ జాయలు పోక భాస్కరా! 107
ఉ. హీనకులంబునందు జనియించినవారికి సద్గుణంబు లె
న్నేనియుఁ గల్గియున్న నొక నేరము చెందకపోదు; పద్మముల్
భూనుతిఁ గాంచియు\న్ బురదఁ బుట్టుట వల్ల సుధాకరోదయం
బైన నసహ్య మొందవె ప్రియంబునఁ జూడఁగ లేక భాస్కరా! 108
ఉ. ఇంచుక నేర్పు చాలక విహీనతఁ జెందిన నా కవిత్వము\న్
మించు వహించె నీకతన మిక్కిలి యెట్లనఁ దోలుబొమ్మలు\న్
మంచివివేకి వాని తెరమాటున నుండి ప్రశస్తరీతి నా
డించిన నాడవే జనుల డెందము నింపవె ప్రీతి భాస్కరా! 109
0 Comments